కాంగ్రెస్ దాడులపై కేటీఆర్ ఫిర్యాదు
తెలంగాణ డీజీపీ జితేందర్ ను కలిసిన నేతలు
హైదరాబాద్ – రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, కాంగ్రెస్ గూండాలు పనిగట్టుకుని ప్రతిపక్ష నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
శుక్రవారం కేటీఆర్ సారథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులు డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ ను కలిశారు. ఈ సందర్బంగా వినతి పత్రం సమర్పించారు. రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 22న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
ధర్నా చేపట్టిన వారిపై అకారణంగా దాడులకు పాల్పడ్డారని వాపోయారు కేటీఆర్. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. పోలీసులు స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం, టెంట్ పీకి వేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారని డీజీపీకి ఫిర్యాదు చేశారు .
రాష్ట్రంలో రుణ మాఫీ జరిగిన తీరు పైన ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోయిన ఇద్దరు మహిళా జర్నలిస్టుల పైన, ఇతర జర్నలిస్టుల పైన దాడి చేసిన తీరుపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంత కాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో పోలీస్ అధికారులు ఎలా పాల్గొంటారంటూ ప్రశ్నించారు కేటీఆర్ .