గోపన్‌పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించండి
కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ సూచన
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పనికి మాలిన సర్కార్, అవగాహన లేని నాయకత్వం ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన చెందారు.
నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టు పక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్‌పల్లి ఫ్లై ఓవర్ కొన్ని నెలల క్రితం పూర్తయిందని తెలిపారు కేటీఆర్. కానీ నేటికీ ఇది ప్రారంభోత్సవానికి నోచు కోవడం లేదని ఆరోపించారు.
చర్యలు తీసుకోవాల్సిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి బిజీగా మారారని, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం చేయాల్సిన సీఎం ఇతర కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడం దారుణమన్నారు.
ఇప్పటికైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.