జాబ్ క్యాలెండర్ కాదు ఎన్నికల క్యాలెండర్
ఎద్దేవా చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై స్పందించారు. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిరుద్యోగులను మోసం చేసేందుకు ఉద్దేశించిన జాబ్ క్యాలెండర్ అంటూ మండిపడ్డారు. ఇంకా ఎంత కాలం మోసం చేస్తారంటూ ప్రశ్నించారు.
ఇదేనా ప్రజా పాలన అంటూ నిలదీశారు కేటీఆర్. ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల జాబ్స్ ను భర్తీ చేస్తామని చెప్పారని, ఇప్పుడు మభ్య పెట్టే పనిలో పడ్డారంటూ మండిపడ్డారు. ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు, ఖాళీలు, శాఖలు, పరీక్షల నిర్వహణ తేదీలు..ఫలితాలు ప్రకటించే తేదీలను ప్రకటిస్తారని కానీ భట్టి రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ లో ఇవేవీ లేవన్నారు.
జాబ్ క్యాలెండర్ కాదని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతీ యువకుల ఓట్లను కొల్లగొట్టేందుకు వేసిన ప్లాన్ తప్ప మరోటి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగులను మోసం చేయడాన్ని ప్రశ్నించిన తమను అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు .