దళిత మహిళపై దాడి దారుణం
ఖండించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో దళితులు, బహుజనులపై దాడుల పరంపర కొనసాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాజాగా షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించారు. ఇది పూర్తిగా అమానవీయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.
దళిత మహిళపై ఇంత దాష్టీకమా..ఇదేనా మీ ఇందిరమ్మ పాలన..ఇదేనా ప్రజా పాలన అంటే అని నిలదీశారు. దొంగతనం ఒప్పు కోవాలంటూ టార్చర్ కు గురి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఆజమాయిషీ లేకుండా పోయిందని మండిపడ్డారు కేటీఆర్.
మహిళ అని చూడకుండా ఇంత దారుణంగా ప్రవర్తించడం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళల పట్ల చులకన భావం ఉందన్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరును పోలీసులు ఆదర్శంగా తీసుకున్నారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్.
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇదే సమయంలో దాడి కారణంగా తీవ్ర గాయాల పాలైన బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.