ప్రభుత్వ లోగో మార్చడంపై కేటీఆర్ కన్నెర్ర
రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో తెలియదు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆనవాళ్లను, గుర్తులను, జ్ఞాపకాలను, లోగోలను పూర్తిగా తొలగించే పనిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏం చేస్తోందంటూ ఆయన ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి అంటూ నిలదీశారు కేటీఆర్.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజ ముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందా అని మండిపడ్డారు.
ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారని నిలదీవారు కేటీఆర్. ఒకవేళ ఆమోదించక పోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.