పేదోళ్ల ఇళ్లు కూల్చివేత గుండె కోత – కేటీఆర్
పెద్దోళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదంటూ ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దోళ్ల ఇళ్లను వదిలేసి పేదోళ్ల నివాసాలను కూల్చి వేస్తే ఎలా అని తీవ్ర స్థాయిలో హైడ్రాపై , కమిషనర్ రంగనాథ్ పై, సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్.
ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన ఫామ్ హౌస్ లను కూల్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పేదోళ్లను చావకొట్టి ఏం సాధించాలని అనుకుంటున్నావంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.
ఒక శాఖ అనుమతి ఇస్తే ఇంకో శాఖ ఎలా కూల్చి వేస్తుందంటూ నిలదీశారు సీఎంను. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. పెద్దలకు ఓ రూల్, పేదలకు ఇంకో రూల్ ఎక్కడైనా ఉంటుందా అన్నారు.
గర్భిణీ మహిళ అని చూడకుండా, చిన్న పాప ఏడుస్తున్నా వినిపించు కోకుండా కూల్చి వేయడం దారుణమన్నారు కేటీఆర్. నీ ప్రభుత్వం చేసిన తప్పులకు ఎవరు బాధ్యత వహించాలని అన్నారు. నీ సోదరుడి ఇల్లు మాత్రం భద్రంగా ఉండాలి..కానీ పేదోళ్ల ఇళ్లు మాత్రం కూల్చుతానంటే ఎలా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నగర వాసులు ఓట్లు వేయలేదనే కక్షతోనే ఇలా చేస్తున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు మాజీ మంత్రి. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ బృందం అండగా ఉంటుందని ప్రకటించారు .