నేతలు పార్టీని వీడడం సహజం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలు పార్టీని వీడడం సర్వ సాధారణమని పేర్కొన్నారు. క్రోధి నామ సంవత్సరం సందర్బంగా ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాజకీయాలు అన్నాక నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ కావడం సర్వ సాధారణమని స్పష్టం చేశారు కేటీఆర్. ఇందులో ఆలోచించాల్సింది ఏముందంటూ ప్రశ్నించారు. తమ పార్టీకి 24 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఈ దేశంలో తమ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు.
ఉద్యమాలను, పోరాటాలను నడిపిన చరిత్ర తమదన్నారు. బహుషా ఈ దేశంలో ఒక ప్రాంతం కోసం అలుపెరుగని రీతిలో పోరాటం చేసింది మేమేనన్నారు కేటీఆర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం తమకు లభించిందని చెప్పారు.
తమ వంతుగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందంజలో నిలిపేందుకు కృషి చేశామని, కానీ అనుకోని రీతిలో కాంగ్రెస్ పార్టీ ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను నమ్మించిందని, పవర్ లోకి వచ్చిందన్నారు కేటీఆర్.