సికింద్రాబాద్ లో గులాబీదే గెలుపు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సికింద్రాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమ పార్టీ నుంచి జంప్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎంపీగా బరిలో ఉన్నాడని, ఆయన ఓడి పోవడం ఖాయమని స్పష్టం చేశారు కేటీఆర్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
పిలిస్తే పలికే నాయకుడిగా, వివాదాలకు దూరంగా ఉండే పద్మా రావు గౌడ్ గెలుపు ఖాయమై పోయిందన్నారు. ఇక ఆయనను ఎవరూ ఆపలేరన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్.
గెలిచినా ఓడి పోయినా కేసీఆర్ వెన్నంటి ఉండే నాయకుడు పద్మా రావు గౌడ్ అని ప్రశంసించారు. కిషన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. మైనార్టీ సోదరులు ఒక్కసారి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించు కోవాలని సూచించారు.
ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయమన్నారు. ప్రజలకు కాంగ్రెస్ వల్ల ఒరిగింది ఏమీ లేదని తేలి పోయిందన్నారు కేటీఆర్. ఇక మార్పు కోరుకుంటున్నారని తిరిగి గులాబీకే పట్టం కట్టాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.