మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముమ్మాటికీ ఎవరు కాదన్నా ఔనన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ హయాంలోనే తెలంగాణకు గుర్తింపు లభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అబద్దాలు, మోసాలు, దౌర్జన్యాలు, కేసులు, ఆత్మహత్యలు తప్ప ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు చెప్పినట్లు మీరు ఎన్ని తిట్టినా తెలంగాణ కోసం భరిస్తామని చెప్పారు. మంత్రులు , సీఎం దూషించినా అవి తమకు దీవెనలని అనుకుంటామని అన్నారు కేటీఆర్. కానీ కేసులకు, జైళ్లకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలు పూర్తి ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దస్తమానం తమపై, తమ అధినాయకుడిపై , కుటుంబంపై నోరు పారేసు కోవడం తప్ప పనీ పాట లేదని ధ్వజమెత్తారు కేటీఆర్. ఇది మంచి పద్దతి కాదన్నారు. మీరు ఎంతగా తిట్టినా జనానికి మీకు పాలన చేత కాదని తేలి పోయిందన్నారు. అందుకే ప్రతి చోటా నిరసన వ్యక్తం అవుతోందన్నారు. ఇచ్చిన హామీల సంగతి ఏమిటో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు. తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు తాము ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్. రైతులు పంటలు ఎండి పోయి ఇబ్బంది పడుతున్నారని, ఇంకో వైపు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని , ఏదో ఒక రోజు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.