కేసీఆర్ టార్చ్ బేరర్ – కేటీఆర్
ఆయనను తట్టుకోవడం కష్టం
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం పదవుల కోసం పార్టీని వదిలి వెళుతున్న నాయకుల గురించి పేర్కొన్నారు. ఎవరు ఉన్నా లేకున్నా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు కేటీఆర్.
ఇలాంటి ఒడిదుడుకులను, కష్టాలను, ఇబ్బందులను ఎన్నో చూసిన చరిత్ర కేసీఆర్ కు ఉందన్నారు. ఆయన దమ్మున్న నాయకుడని, విజన్ ఉన్న గొప్ప లీడర్ అని కితాబు ఇచ్చారు . ఆయనకు తాను తనయుడిగా పుట్టడం పూర్వ జన్మ సుకృతమని స్పష్టం చేశారు కేటీఆర్.
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని, ఒక్కడుగా బయలు దేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం తన తండ్రిదని పేర్కొన్నారు.
ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని హెచ్చరించారు కేటీఆర్. తమ పార్టీని ప్రజలే తమ గుండెల్లో పెట్టుకుంటారని కుండ బద్దలు కొట్టారు. నిఖార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని , పోరాటం ఆపమని హెచ్చరించారు.