NEWSTELANGANA

రైతును రాజును చేసిన ఘ‌న‌త కేసీఆర్ దే

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రాన్ని వ్య‌వ‌సాయ ప‌రంగా దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా తీర్చి దిద్దిన ఘ‌న‌త తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని స్ప‌ష్టం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

బుధ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. స్వరాష్ట్రం ఏర్పడ్డప్పుడు బియ్యం పండించడంలో తొలి పది స్థానాల్లో కూడా లేని తెలంగాణ ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వ కారణమని పేర్కొన్నారు.

నెర్రెలు బారిన ఈ నేల పచ్చ బ‌డింద‌ని, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాష్ట్రమూ సాధించని అరుదైన రికార్డు సాధించింద‌ని అన్నారు. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా ఎదిగిందీ అంటే దానికి కారణం రైతు బిడ్డగా కేసీఆర్ దార్శనికత, కార్యాచరణనేన‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

భూగోళం మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఆహారాన్ని మనమే పండించుకోవాలి కానీ ఇంకెవరూ మనకు ఆహారం సమకూర్చలేరు అని కేసీఆర్ గారు తరచూ చెప్పార‌ని, దానిని ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించార‌ని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టి, రైతుబంధు పెట్టుబడి సాయం అందించి, 24 గంటల ఉచిత కరెంటు, పండిన ధాన్యం కొనుగోలు చేసి, కొత్త గోదాములు, రైతు వేదికలు కట్టి – ఇలా ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం వ‌ల్ల‌నే ఇవాళ తెలంగాణ టాప్ లో నిలిచింద‌న్నారు కేటీఆర్.