ప్రశ్నిస్తే దాడులు చేస్తారా – కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ పై సీరియస్ కామెంట్స్
రంగారెడ్డి జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి అత్యంత గొప్పదన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని సూచించారు. ఇచ్చిన హామీల గురించి ఊసెత్తకుండా, ప్రశ్నించే వారిపై దాడులకు తెగ బడటం ఎంత వరకు సబబు అని నిలదీశారు కేటీఆర్.
అశోక్ నగర్ లో పిల్లలు ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియాలో చూస్తున్నామని, కానీ ప్రధానంగా మెయిన్ మీడియాలో చూపించడం లేదని వాపోయారు. ప్రధాన మీడియా మరోసారి ఆలోచించాలని హితవు పలికారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చి అశోక్ నగర్ లో గత ఏడాది విద్యార్థులకు భరోసా ఇచ్చారని, ఆ విషయం ఇద్దరూ మరిచి పోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎన్ని జాబ్స్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్ సీఎంను.