కుంగిపోం బరిగీసి గెలుస్తాం
ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – ఓడి పోయామని తాము కుంగి పోవడం లేదని , బరిగీసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుధవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు అన్నాక గెలుపు ఓటములు సహజమన్నారు.
ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని చెప్పారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణను తీసుకు వచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ది చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి, ఆరు గ్యారెంటీలతో గారడీ చేసిందని ఎద్దేవా చేశారు కేటీఆర్.
విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకు వచ్చామని, కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యను పేద పిల్లలకు అందించిన ఘనత బీఆర్ఎస్ దేనని మరిచి పోవద్దన్నారు.
రేవంత్ రెడ్డి ఓ 420 అని కామెంట్ చేశారు. పెన్షన్ సంగతి ఊసెత్తడం లేదని, రైతు బంధు ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు కేటీఆర్. పవర్ లోకి వస్తే 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తానని చెప్పాడని ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తయినా ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు.
స్కాంల పేరుతో కాలయాపన చేస్తున్నాడని, ఫోన్ ట్యాపింగ్ పక్కన పెట్టి వాటర్ ట్యాపింగ్ లపై దృష్టి సారిస్తే మంచిదన్నారు కేటీఆర్. చేవెళ్లలో పనికి రాని చెత్తను మల్కాజిగిరిలో పడేశాడంటూ ఫైర్ అయ్యారు. కోటి 67 లక్షల మంది మహిళలకు 2,500 రూపాయలు వచ్చాయా అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆ రెండూ కలిసి బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నాయంటూ ఆరోపించారు.