NEWSTELANGANA

అనాలోచిత నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌కు శాపాలు – కేటీఆర్

Share it with your family & friends

తెలంగాణ స‌ర్కార్ పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ పూట‌కో మాట మాట్లాడుతూ అర్థం ప‌ర్థం లేని నిర్ణ‌యాలు తీసుకుంటూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని మండిప‌డ్డారు. బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్‌లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. మోడీ నోట్ల ర‌ద్దు విష‌యంలో మాట‌లు మార్చిన‌ట్టే మూసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మారుస్తున్నాడ‌ని, పూట‌కో మాట మాట్లాడుతూ క‌న్ ఫ్యూజ్ చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఒక రోజు మూసీ సుందరీకరణ అంటారు. ఒక రోజు నల్గొండకు నీళ్లు అంటారు. ఒక రోజు రూ. లక్షా 50 వేల కోట్లు ఎక్కడివి అంటారు. ఒక రోజు డీపీఆర్ లేనే లేదంటారు..ఒక ప్లాన్ అన్న‌ది లేకుండా ముందుకు వెళ్ల‌డం స‌బ‌బు కాద‌న్నారు కేటీఆర్.

ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితమే పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వాటిని కూల గొడతామని అంటే ఎలా అని ప్ర‌శ్నించారు. దానిని తాము అడ్డుకుని తీరుతామ‌ని హెచ్చ‌రించారు . హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. హైడ్రాను పెద్ద, పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే ఉపయోగిస్తున్నారని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు కేటీఆర్.

మూసీ పేరిట ఏ విధంగా లూటీ చేస్తున్నారో ప్రజల దృష్టికి తీసుకు వెళతామ‌ని , మూసీకి సంబంధించి 100 శాతం మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను తాము రూ. 4 వేల కోట్లతో నిర్మించామ‌ని చెప్పారు. మూసీని శుద్ది చేశామ‌ని, దీంతో ఈ నీళ్ల‌న్నీ న‌ల్లగొండ‌కు వెళ‌తాయ‌ని తెలిపారు. దాని కోసం కొత్తగా ఖర్చు చేయాల్సిన పని లేదన్నారు.

కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తెచ్చేందుకు 11 వందల కోట్లు ఖర్చు చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామ‌ని, ఇక రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్.
మూసీ సుంద‌రీక‌ర‌ణ‌ఖు ల‌క్షా 50 వేల కోట్లు ఎందుకో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.