సర్కార్ నిర్వాకం అధికారులకు శాపం
సీరియస్ కామెంట్స్ చేసిన కేటీఆర్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ పై దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతి భద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవ్వాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే తిరగబడ్డ రైతులు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు కేటీఆర్.
నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనా రాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని సంచలన ఆరోపణలు చేశారు .
భూసేకరణ పూర్తయ్యి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే అసంబద్ద అలోచన వల్లనే ఇంత అలజడి జరిగిందని ఆరోపించారు కేటీఆర్.
ఫార్మా సిటీకోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ము చేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధి వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందన్నారు. అక్కడ కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైందని వాపోయారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోందని అన్నారు.. అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుందని జోష్యం చెప్పారు.