పొంగులేటి సవాల్ కేటీఆర్ ప్రతి సవాల్
దమ్ముంటే హైకోర్టు సీజే వద్దకు రావాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై సవాల్ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. దమ్ముంటే ఆధారాలతో సహా తన వద్దకు రావాలని, ఇద్దరం కలిసి హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలుద్దామని ఛాలెంజ్ విసిరాడు.
తాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై, ఆయన బావ మరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించి అమృత్ స్కీంలో చోటు చేసుకున్న స్కామ్ కు చెందిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్.
పొంగులేటి చేసిన ఆరోపణలు, విమర్శలు సత్య దూరమని పేర్కొన్నారు. తాను సీఎంపై, ఆయన బావ మరిదిపై విమర్శలు చేస్తే మంత్రి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి.
తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దమ్ముంటే రావాలంటూ సవాల్ విసిరారు కేటీఆర్. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు.
మరో కేంద్ర స్కీంకు సంబంధించి తాము ఆరోపణలు చేస్తుంటే రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు కేటీఆర్.