లగచర్ల ఘటనపై రాహుల్..మోదీ మౌనమేల..?
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనకు సంబంధించి చర్చనీయాంశంగా మారితే ఇప్పటి వరకు బాధ్యత కలిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు.
సీఎం ఇలాఖాలో గిరిజనులపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు. ఇది మీ బాధ్యత కాదా అని అన్నారు. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్లిందని, అయినా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు కేటీఆర్. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించు కోదని పేర్కొన్నారు.
ఇళ్లన్నీ తగలబడి పోయి.. ఊచకోత జరిగేదాకా వేచి చూడాలని అనుకుంటున్నారా అని మండిపడ్డారు. పదే పదే రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుని దేశ వ్యాప్తంగా రక్షించాలని కోరుతున్న రాహుల్ గాంధీకి ఈ ఘటన కనిపించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దారుణాలపై రాహుల్ , పీఎం మోడీ స్పందించాలని, న్యాయ విచారణ చేపట్టాలని కోరారు కేటీఆర్.