NEWSTELANGANA

తెలంగాణ‌లో గాడి త‌ప్పిన పాల‌న – కేటీఆర్

Share it with your family & friends

పిచ్చోడి చేతిలో రాయిలా మారింద‌ని ఆరోప‌ణ

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్ర‌వారం ఆయ‌న సీఎం చేసిన కామెంట్స్ కు కౌంట‌ర్ ఇచ్చారు. పాల‌న చేత‌కాక అడ్డ‌దిడ్డంగా ఆరోప‌ణ‌లు చేయ‌డం రేవంత్ రెడ్డికి అల‌వాటుగా మారింద‌ని అన్నారు.

ప‌నికి మాలిన‌ మాట‌లు.. పాగ‌ల్ ప‌నులు త‌ప్ప ఒక్క‌టైనా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ 10 నెల‌ల కాలంలో మంచి ప‌ని చేశారా అని ప్ర‌శ్నించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారి పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.. త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తోంద‌ని ఫైర్ అయ్యారు కేటీఆర్.

మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసు కోవాల్సింది చాలా ఉందన్నారు. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయం లో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయ్యింద‌న్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు.

మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానం సాధించిందని స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌న‌త త‌మ నాయ‌కుడు కేసీఆర్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు కేటీఆర్.
బిల్డ‌ర్ల‌ను, రియ‌ల్ట‌ర్ల‌ను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసిందని తెలిపారు.

మీ బడే భాయ్ మోడీ ఐటీఐఆర్ ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యక పోయినా, ఐటీ ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కెసిఆర్ నాయకత్వానిద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

దిల్లీకి డ‌బ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్త‌న భాండా గార‌మైందన్నారు. దేశంలోనే ధాన్య రాశిగా మారిందన్నారు. మూసీ న‌దికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హ‌ర్మ్యాలు క‌డుతున్న‌ప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ ప‌క్క‌న పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్ర‌ద‌ర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు అని ఎద్దేవా చేశారు కేటీఆర్.

ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. స‌మావేశాల్లో త‌ల కింద‌కి, మీద‌కి తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌ద‌న్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్ర‌భుత్వ బ‌డి పిల్ల‌ల ఇజ్జ‌త్ తీయ‌కని సూచించారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌తారని, ప్ర‌పంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారు ఎంద‌రో ఉన్నార‌ని వారి గురించి తెలుసుకుంటే మంచిద‌న్నారు కేటీఆర్.