NEWSTELANGANA

లీగ‌ల్ నోటీస్ పంపిస్తే భ‌య‌ప‌డం – కేటీఆర్

Share it with your family & friends

రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సీఎం త‌నను టార్గెట్ చేసినా ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

బావ మరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.

బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చ‌రించారు మాజీ మంత్రి. ముఖ్యమంత్రికి చెందిన శాఖ‌లోనే ఆయ‌న బావ మ‌రిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ. 1,137 కోట్ల టెండ‌ర్ క‌ట్ట బెట్టింది వాస్త‌వ‌మ‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌మ ఉన్నాయ‌ని పేర్కొన్నారు .

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజ‌మ‌ని, అక్ష‌రాల వాస్త‌వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని వెల్ల‌డించారు.

ఢిల్లీలో ఉన్న నీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన దోస్తులు కూడా కాపాడ‌డం క‌ష్ట‌మేన‌ని హెచ్చ‌రించారు కేటీఆర్. ఈ దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ బ‌లంగా ఉంద‌ని, ఇక రేవంత్ రెడ్డికి శిక్ష ప‌డ‌టం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు .