హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి భయాందోళనకు గురి చేస్తున్నారని, దీంతో తమ హయాంలో ఒక వెలుగు వెలిగిన రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కుదేలైందని వాపోయారు.
హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. భూమి కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు ఇక్కడి బిడ్డలందరికీ తెలుసు అన్నారు . ఎన్నో భూ ఉద్యమాలకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు కేటీఆర్.
ప్రతి ఒక్కరి జీవితం భూమి చుట్టూ తిరుగుతోందని, వీటి విలువ భారీగా పెరిగిందని, దీంతో పంచాయతీలు ఉంటాయని, జాగ్రత్తగా కాపాడు కోవాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీకి మొదట్లో రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో పట్టు దొరక లేదన్నారు.
ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని చాలా ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతదంటే ఎవరు నమ్మలేదన్నారు. అసలు రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
హిందూ – ముస్లిం పంచాయితీ, నక్సలిజం, భూముల ధరలు పడిపోతాయంటూ ప్రచారాలు చేశారని ఆరోపించారు. కానీ తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ పొట్టి కూటి కోసం వచ్చిన వాళ్లతో మాకు పంచాయితీ లేదని స్పష్టం చేశారు.
అభివృద్ధే మా మతం, సంక్షేమమే మా కులం అంటూ కేసీఆర్ కుండ బద్దలు కొట్టారని అన్నారు. గతంలో బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారు. కానీ గత 20 ఏళ్లుగా మాత్రం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లు భూమి మీద పెట్టుబడి పెట్టారని చెప్పారు కేటీఆర్.
నీళ్లు ఉంటేనే భూమికి విలువ ఉంటుందని గమనించారని, అందుకే నీళ్లు గల గలా పారేలా చేశారని అన్నారు. ఈ క్రెడిట్ తన తండ్రికి దక్కుతుందన్నారు. భూమి విలువ పెరిగితే యజమానికి కొంత భద్రత ఉంటుందన్నారు.