దోచుకునేందుకే అంచనాలు పెంచారా..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై , కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు.
మూసి ప్రక్షాళన కోసం తమ ప్రభుత్వం 16 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభిస్తే, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంచనాను ఏకంగా 1,50,000 కోట్లకు పెంచిందని ఆరోపించారు కేటీఆర్.
గతంలో కొండ పోచమ్మ సాగర్ నుండి గండిపేటలో నీళ్ళు పోయాలని రూ.1100 కోట్లతో చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ప్రాజెక్టును ఇప్పుడు రూ.5,650 కోట్లకు పెంచారని ధ్వజమెత్తారు. ఎవరి కోసం ఈ అంచనాలు పెంచారని ప్రశ్నించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, దోచుకునేందుకే వీటికి సంబంధించి అంచనాలు పెంచారని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ఇకనైనా అంచనాలు పెంచడం మానేసి, హైడ్రా పేరుతో భయాందోళనకు గురి చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.