అబద్దాలకు కేరాఫ్ రాహుల్ గాంధీ – కేటీఆర్
ఎంపీపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకెంత కాలం ప్రజలను ఆచరణకు నోచుకోని హామీలతో మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ఆదివారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. తెలంగాణలో సర్కార్ ఏర్పడి ఏడాది కావస్తోందని , ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని, దీనికి ఏం సమాధానం చెబుతారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.
ఆడ లేక మద్దెల మోత అన్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంటూ ఆరోపించారు . రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని రాచరిక పాలన కొనసాగుతోందంటూ ధ్వజమెత్తారు. కోడంగల్ నియోజకవర్గంలో పచ్చని పంట పొలాలపై సీఎంతో పాటు ఆయన కుటుంబం కన్నేసిందని, అక్కడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల సందర్బంగా తెలంగాణ లోని మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని, 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామని ప్రకటించారని, ఇప్పటి వరకు దాని ఊసే లేదని సీరియస్ అయ్యారు కేటీఆర్. ఇకనైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలని, లేక పోతే ప్రజలు ఛీ కొట్టే రోజు దగ్గరలోనే వస్తుందన్నారు.