NEWSTELANGANA

సింగ‌రేణి కార్మికుల‌కు ఇచ్చింది బోన‌స్ కాదు బోగ‌స్

Share it with your family & friends


నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ కార్య నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. సింగ‌రేణి కార్మికుల‌కు ఇచ్చింది బోన‌స్ కాద‌ని అది బోగ‌స్ అంటూ కొట్టి పారేశారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంద‌ని ఆరోపించారు. పండుగ వేళ.. ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్.

లాభాల బోనస్ అంతా బోగస్ అని, ప్రతి సింగరేణి కార్మికుడికి కనీసం లక్షా 80 వేలు నష్టం వాటిల్లింద‌ని మండిప‌డ్డారు. సింగ‌రేణి నికర లాభం 4701 కోట్లు కాగా అందులో కార్మికుల‌కు న్యాయంగా ద‌క్కాల్సిన వాటా 33 శాతం ఇవ్వాల‌ని, అంటే రూ. 1551 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు కేటీఆర్.

వాటా ప్ర‌కారం చూస్తే ప్ర‌తి సింగ‌రేణి కార్మికుడ‌కు క‌నీసం రూ. 3,70,000 రావాలని స్ప‌ష్టం చేశారు. కానీ కేవ‌లం ప్ర‌భుత్వం 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు ఇస్తామ‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. ఇస్తే మొత్తంగా లాభాల్లో వాటా ఇవ్వాలి, లేకపోతే తాము ఇచ్చేది కేవలం 16.9 శాతం మాత్ర‌మేన‌ని చెప్పాల‌న్నారు. ఇలా మోసం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మొత్తం పది సంవత్సరాల్లో కార్మికులకు లాభాల వాటా రూపంలో దక్కింది కేవలం 365 కోట్ల రూపాయలు మాత్రమేన‌ని, బీఆర్ఎస్ ప‌వ‌ర్ లో ఉన్న స‌మ‌యంలో లాభాల వాటా రూపంలో సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 2,780 కోట్లు ఇచ్చామ‌ని చెప్పారు కేటీఆర్. ఒక్కో కార్మికుడికి 32 శాతానికి పైగా ఇచ్చామ‌ని స్ప‌ష్టం చేశారు.

సింగరేణి ప్రాంతంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కార్మిక లోకానికి ప్ర‌భుత్వం ఇచ్చిన బహుమానమా ఇది అంటూ ఎద్దేవా చేశారు.