కాంగ్రెస్..బీజేపీకి గుణపాఠం తప్పదు
మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్
హైదరాబాద్ – సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గుణపాఠం తప్పదని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ ఒక్కటై పోయాయని బడే భాయ్ మోదీ , చోటే భాయ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. విచిత్రం ఏమిటంటే రెండు పార్టీలతో తాము కలిసి పోయామంటూ రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ చెప్పడం మరీ విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్.
ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రచారం చేసుకునే భారతీయ జనతా పార్టీకి ఈసారి అంత సీన్ లేదన్నారు. తెలంగాణ వర ప్రదాయనిగా పేరు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం, పీఎం ఇద్దరిదీ ఒకే మాట అంటూ మండిపడ్డారు.
ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బలిచేయాలని చూస్తుంటే.. మరొకరు తమిళనాడు కోసం తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. మోదీ కావాలని తెలంగాణపై కక్ష కట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గమనించి కాంగ్రెస్, బీజేపీకి గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.