ఏం సాధించారని ఢిల్లీలో ప్రచారం
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణకు ఏం ఒరగ బెట్టారని ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉంది సీఎం వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలుకు అతీ గతి లేకుండా పోయిందన్నారు. ఢిల్లీలో కొత్త నాటకానికి తెర లేపాడంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. సీఎంకు అంత సీన్ లేదన్నారు.
తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి దేశ రాజధానిలో ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి అంటూ సెటైర్ వేశారు.
ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ? తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు ? రైతు భరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ ? ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ ? రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ ? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ అంటూ నిలదీశారు కేటీఆర్.
పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా రేవంత్ రెడ్డీ..కాస్తా సిగ్గుండాలె అంటూ హితవు పలికారు.