కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
కరీంనగర్ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ప్రజలకు శాపంగా మారిందన్నారు. కరీంనగర్ జిల్లాలో నీళ్లు అందక పంటలు ఎండి పోతున్న పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఈ మేరకు ఆయన స్వయంగా పొలాల వద్దకు వెళ్లారు.
జిల్లా లోని ఇరుకుళ్ల గ్రామంలో సాగు నీరందక ఎండిన వరి పంట పొలాలను పరిశీలించారు కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. తమ పాలనలో నీళ్లు సక్రమంగా అందేవని, పంటలు పచ్చగా ఉండేవని, కళకళ లాడేవని కానీ ఇప్పుడు నీరందక నెర్రెలు బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. సీఎం కేవలం వ్యక్తిగత ప్రచారంపై ఫోకస్ పెడుతున్నారే తప్పా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.
పంటలు నష్ట పోకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పంటలు ఎండి పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.