గ్యారెంటీలు కావవి గారడీలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మేడ్చల్ జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మేడిపల్లిలో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమది ఉద్యమ నేపథ్యం కలిగిన పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికలు అన్నాక గెలవడం , ఓడి పోవడం సర్వ సాధారణమని ఇందులో బాధ పడాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు కేటీఆర్.
గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి దాకా గారడీ చేసిందని, ప్రజలను నమ్మించి మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు. ఉగాది పచ్చడిలో మాదిరిగా జీవితంలో అన్ని రకాల రుచులు ఉంటాయన్నారు కేటీఆర్.
తెలంగాణ నుంచి కేసీఆర్ ను ఎవరూ విడదీయలేరని అన్నారు. చావు నోట్లో తల పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక్క తన తండ్రికే ఉందన్నారు కేటీఆర్. పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా మార్చేందుకు ప్రయత్నం చేశామన్నారు.
ఇచ్చిన ఆరు హామీల ఊసే లేదన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు కేటీఆర్. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు.