దాహం దాహం ప్రభుత్వం విఫలం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – రాష్ట్రంలో రోజు రోజుకు తాగు నీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
తమ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కానీ సీఎం తమను , పార్టీని విమర్శించడంతోనే సరి పోతోందని, ప్రజలు ఎదుర్కొంటున్న కనీస తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు దృష్టి పెట్టక పోవడం దారుణమని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిత్యం నీటి కోసం కటకటగా మారిందని, నగర వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు కేటీఆర్. ప్రజలు ఓ వైపు ఇక్కట్ల పాలవుతుంటే, దాహంతో తపిస్తుంటే సోయి లేకుండా సీఎం ఉండడం శాపంగా మారిందన్నారు . ఇకనైనా భేషజాలు వీడి వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.