ఆస్పత్రులను పరిశీలిస్తే అరెస్టులా..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ గాంధీ ఆస్పత్రిని సందర్శించేందుకు వెళ్లిందని, దీనిని కావాలని ప్రభుత్వం అడ్డు కోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నారని, ఇందుకు నిదర్శనమే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడమేనని మండిపడ్డారు కేటీఆర్. ఇది మంచి పద్దతి కాదన్నారు.
తెలంగాణ ఈ దేశంలో లేదా అని ఫైర్ అయ్యారు. నిరసన తెలియ చేయడం, ఆస్పత్రులను సందర్శించడం తప్పు ఎలా అవుతుందని అన్నారు. ఎందుకు ఇంతగా సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి నియమించిన అధ్యయన కమిటీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం డా. తాటికొండ రాజయ్యను, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ , మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ , నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ లను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
వెంటనే వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.