వైద్య విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధం అని నిలదీశారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం అని ఎద్దేవా చేశారు. విద్యార్థులను ఆగం చేసి.. ఇంకెంత కాలం దీన్ని సాగదీస్తారంటూ ధ్వజమెత్తారు కేటీఆర్.
తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్ గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీఓ 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ఎందుకింత మొండిపట్టు పడుతోందని మండిపడ్డారు.
స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. రోజురోజుకు ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతోందో అర్థం కావడం లేదన్నారు.
తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమైక్యరాష్ట్రంలో 5 కేవలం మెడికల్ కాలేజీలు ఉంటే.. స్వరాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని వాటి సంఖ్యను 34కు పెంచుకున్నది ఇందుకేనా ? జిల్లాకో మెడికల్ కాలేజీ నినాదాన్ని బీఆర్ఎస్ హయాంలో నిజం చేస్తే.. కాంగ్రెస్ సర్కారు రాగానే దారుణంగా నీరు గారుస్తోందని ఆరోపించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ ను సీట్లను ఏకంగా 8915కు పెంచుకుని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే, ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తోందని వాపోయారు కేటీఆర్.