ఆవేదన చెందిన కేటీఆర్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై కోపం ఉంటే తీర్చుకోండని కానీ రైతులపై పగ తీర్చుకోవద్దంటూ కోరారు. మేడిగడ్డను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మేడిగడ్డకు సంబంధించి 1.6 కిలోమీటర్ల బరాజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని తెలిపారు. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండు సార్లు కొట్టుకు పోయాయని ఆరోపించారు.
నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయని తెలిపారు. సాగర్, శ్రీశైలంలో వచ్చిన లీకేజ్‌లను తాము రాజకీయం చేయలేదన్నారు . నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని, దీని ద్వారా రూ. లక్ష కోట్లు కొట్టుకు పోయాయని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తమపై ఏదైనా కోపం, రాజకీయ వైరం ఉంటే తీర్చుకోండని అన్నారు. మేడిగడ్డను మరమ్మతులు చేయొచ్చని నిపుణులు చెప్పారని, అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని కోరారు.