గాడి తప్పిన కాంగ్రెస్ పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ఓ వైపు నిరుద్యోగులు, ఉద్యోగులు రోడ్డెక్కారని, తను మాత్రం తమపై బురద చల్లే ప్రయత్నం చేయడం మానుకోవడం లేదని అన్నారు.
మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు. వచ్చినట్టుగానే అరాచక పాలన సాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తుకు తెస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు.
బల్లి పడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు కనిపించడం బాధాకరమని పేర్కొన్నారు. భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న వైనం మరిచిపోక ముందే రోజుకో వింత చోటు చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న కోమటిపల్లి హాస్టల్ లో వడ్డించిన ఉప్మాలో బల్లి పడడంతో 20 మంది విద్యార్థులకు వాంతులు అయ్యాయని తెలిపారు. ఇక సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్ లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తి పోయారని పేర్కొన్నారు.