అబద్దాలకు కేరాఫ్ కాంగ్రెస్
420 హామీల సంగతి ఏంటి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. వాస్తవాలను తెలియ చెప్పేందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అబద్దాలు, మోస పూరితమైన హామీలతో ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు కేటీఆర్.
మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతోందంటూ ఆరోపించారు. ప్రజలు మరోసారి పోకుండా ఉండేందుకే తాము ఆందోళన బాట పట్టామని చెప్పారు . రాబోయే రోజుల్లో జనం తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ కుట్రలను ఎండ గట్టేందుకే తాము ఈ ఛలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. చిన్న లోపాన్ని భూతద్దంలో చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకే తాము బయలు దేరి వెళుతున్నామని అన్నారు.
ప్రజా ధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించాల్సింది పోయి కూల్చేందుకు కుట్రలు పన్నడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని నీరు గార్చే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందంటూ మండిపడ్డారు కేటీఆర్.