ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొలువు తీరాక ప్రతీకార రాజకీయాలు పెరిగి పోయాయని ఆరోపించారు. ప్రధానంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఫ్యాక్షన్ రాజకీయ హత్యలకు తెర లేపారంటూ మండిపడ్డారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరు పొందిన శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలా ఎంత మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను చంపుకుంటూ పోతారని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్ కీ దుకాన్ అంటే ఇదేనా అని నిలదీశారు కేటీఆర్. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో చర్చలకు తావు ఉండాలే తప్ప ప్రతీకార చర్యలకు దిగడం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు .
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రధాన కారకుడు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ సర్కార్ కూడా బాధ్యత వహించాలని అన్నారు. లేకపోతే తాము ఆందోళన బాట పడతామని హెచ్చరించారు కేటీఆర్. వెంటనే మంత్రివర్గం నుంచి జూపల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.