NEWSTELANGANA

నిరుద్యోగుల ఆందోళ‌న‌పై మౌన‌మేల‌..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ అభ్య‌ర్థులు రోడ్డెక్కినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని వాపోయారు కేటీఆర్.

ఎన్నిక‌ల‌కు ముందు మాయ మాట‌లు చెప్పి, నిరుద్యోగులు, విద్యార్థుల‌తో ఓట్లు వేయించుకున్న నేత‌లు ఇప్పుడు నోరు మెద‌ప‌క పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంత సేపు త‌మ‌పై నోరు పారేసు కోవ‌డం త‌ప్పితే ఇప్ప‌టి దాకా కొత్త‌గా నోటిఫికేష‌న్లు ఏమైనా వేశారా అని ప్ర‌శ్నించారు కేటీఆర్.

ఇప్ప‌టికైనా కాంగ్రెస్ పార్టీ న‌మ్మించి మోసం చేస్తుంద‌నేది నిరుద్యోగులు గ్ర‌హించాల‌ని సూచించారు. కేవ‌లం రెచ్చ‌గొట్ట‌డం, ఆ త‌ర్వాత పోలీసుల‌తో దాడులు చేయించ‌డం ప‌రిపాటిగా మారింద‌ని వాపోయారు . ఇక‌నైనా క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్ప‌డం మానుకోవాల‌ని, వెంట‌నే నిరుద్యోగుల న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్.

ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.