కక్ష సాధింపు చర్యలకు భయపడం
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కావాలని బంధువులను అడ్డం పెట్టుకుని తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్.
దమ్ముంటే బహిరంగంగా తనతో, తమ కుటుంబంతో ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదన్నారు . తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
కుట్రలు, కుతంత్రాలు కొత్త కాదని, ఆనాడు ఉమ్మడి ఏపీలోనే అన్నీ వదులుకుని చావుకు సిద్దపడి తెలంగాణ కోసం పోరాటం చేశామని వాటి ముందు ఇవి ఎంత అని అన్నారు కేటీఆర్. ఎక్కడైనా , ఎప్పుడైనా సెర్చ్ వారెంట్ తో వస్తారని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన అని నిలదీశారు కేటీఆర్.
కొందరు రేవ్ పార్టీ అంటూ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్దులు, చిన్నారులు కూడా అక్కడ ఉన్నారని, అలాంటప్పుడు రేవ్ పార్టీ ఎలా జరుగుతుందని అన్నారు. పోలీస్ ప్రాథమిక విచారణలో ఏవీ దొరకలేదని పేర్కొన్నారని, ఆ తర్వాత సీన్ ఎలా మారిందని ఫైర్ అయ్యారు.