మోసం కాంగ్రెస్ పార్టీ నైజం
మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
ఆదిలాబాద్ జిల్లా – కాంగ్రెస్ పార్టీ అర చేతిలో వైకుంఠం చూపించిందని, అధికారంలోకి వచ్చాక ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగళవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
నాలుగు నెలల కిందటే సక్కును అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారని అన్నారు. పవర్ పోగానే చాలా మంది పార్టీని వదిలి వెళ్లి పోయారని కానీ ఆత్రం సక్కు మాత్రం వీడలేదని, పార్టీ కోసం కట్టుబడి ఉన్నారని కొనియాడారు. విలువల కోసం ఉన్న ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కేటీఆర్.
రుణమాఫీ, రైతు భరోసా, ఇంట్ల ఇద్దరు ముసళోళ్లు ఉంటే ఆ ఇద్దరికి రూ. 4 వేలు ఇస్తా అంటూ డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండని ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తానని చెప్పిండి అదీ చేయలేదన్నారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తానని దొంగ మాటలు చెప్పిండని, కానీ తీరా నాలుగు నెలలవుతున్నా వాటి జాడ లేదన్నారు కేటీఆర్. రుణ మాఫీ కావాలంటే , వృద్దులకు రూ. 4 వేలు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు జనం బుద్ది చెప్పడం ఖాయమన్నారు మాజీ మంత్రి.