రేవంత్ దెబ్బ అప్పుల కుప్ప – కేటీఆర్
10 నెలల్లో రూ. 80, 500 కోట్ల అప్పులు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో టాప్ లో ఉందని ఆరోపించారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ అడ్డగోలుగా అప్పులు చేసుకుంటూ పోతున్నాడని మండిపడ్డారు. ఇలాగైతే ఏదో ఒక రోజు తెలంగాణను తాకట్టు పెడతాడేమోనన్న అనుమానం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
సీఎంగా రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన రోజు నుండి నేటి రోజు వరకు తీసుకు వచ్చిన అప్పులు అక్షరాల రూ. 80,500 కోట్లు అని పేర్కొన్నారు. ఇది గతంలో ఏ సర్కార్ చేయనన్ని అప్పులు చేశారంటూ వాపోయారు కేటీఆర్.
ఎన్నికల సందర్భంగా అప్పులు తీసుకు రావడాన్ని తప్పు పట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇచ్చిన ఆరు గ్యారెంటీల మాటేమిటి..ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెర వేర్చలేదని, కానీ భారీ ఎత్తున తెచ్చిన అప్పులు ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం అప్పుల కుప్ప వ్యవహారంపై విచారణ జరిపించాలని అన్నారు.