జనం తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది
సర్కార్ ను హెచ్చరించిన కేటీఆర్
సంగారెడ్డి జిల్లా – ఇవాళ కోడంగల్ రైతులు తిరగబడ్డారు. రేపు యావత్ తెలంగాణ సమాజం ఆందోళన బాట పట్టడం ఖాయమని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్రవారం సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామ రైతులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారితో ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఇవాళ అధికారం ఉంది కదా అని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులు తమ ఇష్టానుసారం ఎవరో చెబితే ఎలా కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఓ వైపు కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెబుతుంటే దాడి చేశారంటూ ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు కేటీఆర్.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము పవర్ లోకి వచ్చాక సీన్ రిపీట్ కాక తప్పదన్నారు. కోడంగల్ ఎస్ఐ, వికారాబాద్ ఎస్పీ కలిసి మూడు గంటల పాటు కొట్టారని ఆరోపించారు. వారి శరీరాలు కమిలి పోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కొట్టినట్లు చెబితే ఊరుకోమని, మీ ఇంట్లో ఉన్న వాళ్లపై దాడి చేస్తామని హెచ్చరించారని బాధితులు తమతో చెప్పారని తెలిపారు కేటీఆర్.