NEWSTELANGANA

స‌ర్కార్ ప‌గ రైత‌న్న‌ల ద‌గా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన కేటీఆర్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రుణ మాఫీ పేరుతో మ‌రోసారి తెలంగాణ రైతుల‌ను మోసం చేశారంటూ వాపోయారు.

రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల లోంచే రు. 7000 కోట్లు రుణ మాఫీకి దారి మళ్లించారంటూ ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుండి కొంత మొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని ఫోజులు కొడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణ మాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అని నిల‌దీశారు.

2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చింద‌న్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.