కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ – కేటీఆర్
పండుగల వేళ ప్రజలకు కష్టాలు
రంగారెడ్డి జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రజలకు ఎనలేని కష్టాలు మొదలయ్యాయని వాపోయారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
అడ్డగోలు హామీలు ఇచ్చారని, కానీ వాటిలో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు కేటీఆర్. మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడని, కానీ ఆ మాట ఊసెత్తడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే కాలంలో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
తాము పవర్ లోకి వస్తే రూ. 15 వేలు ఇస్తానని నమ్మించాడని, తీరా కుర్చీ ఎక్కాక దానిని మరిచి పోయాడంటూ సీఎంపై నిప్పులు చెరిగారు కేటీఆర్. ఖజానాలో పైసలు లేవని, రైతు భరోసా ఇవ్వలేమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పి తప్పించుకున్నాడని ఎద్దేవా చేశారు .
బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి అని స్పష్టం చేశారు. తాము ఎల్లప్పటికీ రైతుల పక్షాన ఉంటామని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. బోగస్ మాటలు, బక్వాస్ పనులు తప్పా కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసింది ఒక్క మంచి పని లేదన్నారు .