ధాన్యం నీళ్లల్లో రైతులు ఆందోళనలో
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రైతుల గురించి పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం నీళ్లల్లో ఉన్నా పట్టించు కోక పోవడం దారుణమన్నారు. రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
పెళ్లిళ్లలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని, ప్రజా సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకోక పోవడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
తెలంగాణ రైతన్నల నడ్డివిరిచి గాల్లో విహరిస్తూ ఇబ్బందులకు గురి చేయడం పట్ల మండిపడ్డారు. దసరా పోయింది, దీపావళి పోయింది, కార్తీక మాసం వచ్చినా ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవక పోవడం పట్ల ఫైర్ అయ్యారు .
ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ గింజ గింజకు భరోసా కల్పించారని, కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక దిన దిన గండంగా మారిందన్నారు. మిల్లర్లతో చర్చలు లేవు , రైతుకు భరోసా కరువు , అన్నదాతలను గాలికి వదిలి వేశారని, గాలి మోటార్లు ఎక్కుతూ పాలనను గాలికి వదిలి వేశారని ధ్వజమెత్తారు కేటీఆర్. బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలు చెప్పి మోసం చేశారంటూ మండిపడ్డారు.