సార్వత్రిక ఎన్నికల్లో గులాబీదే జెండా
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కరీంనగర్ జిల్లా – మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మానకొండూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రజల చెవుల్లో పూలు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు.
17 నియోజకవర్గాలలో కనీసం 10కి పైగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారంటూ జోష్యం చెప్పారు. ప్రజల వాయిస్ ను వినిపించేందుకు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరుతో బురిడీ కొట్టించిన కాంగ్రెస్ సర్కార్ కు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలన్నారు.
ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ కావడం పక్కా అని అన్నారు. ఆయన కేవలం పదవి కోసం మాత్రమే ఉన్నాడని, ప్రజల కోసం కాదన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ , బీజేపీ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతుంటే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు కేటీఆర్.