కూల్చివేతలు దారుణం కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రధానంగా పాలన గాడి తప్పిందని ఆరోపించారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజుగా ఫీలవవుతున్నారని, రాచరిక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్.
ప్రధానంగా కోర్టుకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా ప్రీ ప్లాన్ గా హైడ్రా వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఫతేనగర్ లో నిర్మించిన ఎస్టీపీని సందర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేక పోయిందని ఎద్దేవా చేశారు కేటీఆర్. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదా సర్కస్ చేస్తున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడితే ముందస్తుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ హైడ్రా చాలా తెలివిగా , కావాలని పేదలు, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారు నివసిస్తున్న భవనాలను కూల్చి వేస్తోందని మండిపడ్డారు.
కోర్టు జోక్యం చేసుకోలేని విధంగా వారాంతాల్లో కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను మానవతా దృక్ఫథంతో తెలంగాణ హైకోర్టు ఆలోచించాలని కోరారు. దీనిని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద తీసుకోవాలని సూచించారు. లేదంటే తామే పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు కేటీఆర్.