పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం
విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి
హైదరాబాద్ – ప్రతిష్టాత్మకమైన పరీక్షలను నిర్వహించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తాజాగా కేంద్ర సర్కార్ నీట్ 2024 పరీక్ష చేపట్టింది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 25 లక్షల మంది హాజరయ్యారు. పేపర్లను అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఈ విమర్శలు ఎక్కువగా రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విద్యా శాఖ మంత్రి.
ఈ పరీక్ష కోసం 11 లక్షల మంది హాజరయ్యారు. అటు నీట్ ను ఇటు నెట్ ను ఎన్టీఏ నిర్వహించింది. మరి ఎందుకు నీట్ ను రద్దు చేయలేదని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.