మోదీ మోసం ధరా భారం
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. పదేళ్ల నుంచి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలపై పెను భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా ఆయిల్, గ్యాస్ ధరలు మండుతున్నాయని, కానీ దేశం వెలిగి పోతోందని మోదీ ప్రచారం చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రధానంగా పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయని ధ్వజమెత్తారు. ధరలను నియంత్రించలేని ప్రధాని ఎందుకు ఉన్నారో ఒక్కసారి ఆలోచించు కోవాలని సూచించారు.
సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు కేటీఆర్. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు బయలు దేరారని, కాషాయ పార్టీ ఒక రకంగా ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే పెట్రోల్ ధరలు గత 2014 నుంచి 2024 వరకు ఎలా పెరిగాయనేది గణాంకాలతో సహా పేర్కొన్నారు కేటీఆర్. 2014లో మోదీ పీఎంగా కొలువు తీరిన సమయంలో దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 70గా ఉండేదన్నారు. 2024 వరకు వచ్చే సరికల్లా ఆ ధర రూ. 110గా మారిందన్నారు.