ఘనంగా నివాళులు అర్పించిన కేటీఆర్
హైదరాబాద్ – ఆదివాసీ యోధుడు.. అరణ్య సూర్యుడు, పోరాటాల గడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ కుమ్రం భీమ్ అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్టోబర్ 17న కొమురం భీమ్ వర్దంతి. ఈ సందర్బంగా గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కేటీఆర్.
ఇదిలా ఉండగా కొమురం భీమ్ అక్టోబర్ 22, 1901లో పుట్టాడు. అక్టోబర్ 17న 1940లో ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడారు కొమురం భీమ్. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడిగా గుర్తింపు పొందాడు.
ఆదిలాబాద్ అడవులలో గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు పుట్టాడు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది.
కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను తోసిపుచ్చాడు. నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీర మరణం పొందాడు.