చార్మినార్ తొలగింపుపై కన్నెర్ర
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
హైదరాబాద్ – ప్రజా పాలన పేరుతో జనాన్ని మోసం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం బీఆర్ఎస్ సారథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వేలాది మంది ర్యాలీగా ప్రముఖ చారిత్రక కట్టడం చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. తెలంగాణ ప్రాంతానికే ఐకాన్ గా ఉన్న చార్మినార్ ను రాష్ట్ర రాజ ముద్రలోంచి తొలగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇదంతా కావాలని చేస్తున్నారంటూ ఆరోపించారు. దానిని తీసి వేస్తే ప్రతి హైదరాబాదీని అవమానించినట్టేనని , అందరినీ అగౌరవ పరిచినట్టేనని స్పష్టం చేశారు కేటీఆర్.
తెలంగాణ వారసత్వం, సంస్కృతికి చిహ్నమైన చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.పదేళ్లలో జరిగిన మంచి, అభివృద్ధిని గుర్తించకుండా రాజకీయ దురుద్దేశంతో, ప్రతీకార ధోరణితో ప్రవర్తిస్తుండటం దారుణమన్నారు.
కేసీఆర్ పేరు వినిపించ కూడదనే ఉద్దేశ్యంతో ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు కేటీఆర్. ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతినేలా వ్యవహరించ వద్దని సూచించారు.