ఘనంగా కుమార ధార తీర్థ ముక్కోటి
పోటెత్తిన భక్త బాంధవులు
తిరుమల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వాయవ్య దిశలో వెలసి వున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాఘ మాసంలో పూర్ణిమ నాడు కుమార ధార తీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమార ధార తీర్థాన్ని దర్శించి, స్నానం చేయడాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ సందర్భంగా భక్తులు కొండమార్గాల్లో సౌకర్యవంతంగా నడిచేందుకు వీలుగా ఇంజినీరింగ్, అటవీ విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు, తాగునీరు అందించారు. శ్రీవారి సేవకుల సాయంతో భక్తులకు వీటిని అందజేశారు.
మార్గ మధ్యంలో తాగు నీటిని అందుబాటులో ఉంచారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని టీటీడీ భద్రతా విభాగం అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. తీర్థం వద్ద ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటుచేసి అవసరమైన వారికి మందులు అందించారు.