అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడితే ఎలా
అమరావతి – మాజీ మంత్రి , కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమల కొండపై ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని ఈ తరుణంలో దర్శనం చేసుకుని రావాల్సిన సీఎం రాజకీయాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఇప్పటికే తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందంటూ గగ్గోలు పెట్టడమే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చించుకునేలా రాద్దాంతం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు చిలుక పలుకులు పలికితే ఎలా అని నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు కురసాల కన్నబాబు.
తిరుమల తిరుపతి దేవస్థానం మనకెంతో పవిత్రమైనదని అన్నారు. అక్కడ గోవింద నామ స్మరణ మాత్రమే చేయాలని పదే పదే చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి అది మరిచి పోయి ఇతర విషయాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
విచిత్రం ఏమిటంటే టీడీపీ నేతలు , కార్యకర్తలు శ్రీవారి నామ స్మరణ చేయకుండా చంద్రబాబు నామ స్మరణ చేస్తుండడం ఆశ్చర్య పోయేలా చేసిందన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణకు ఆదేశించిందని, సత్యం ఏమిటనేది త్వరలోనే తేలుతుందన్నారు కురసాల కన్నబాబు.